బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అంతా ఉత్తీదేనట!

August 10, 2024


img

గత కొన్ని వారాలుగా బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని లేదా బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవుతారని మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటిని బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఖండించకపోవడంతో అవి నిజమే అయ్యుండవచ్చని ప్రజలు కూడా భావిస్తున్నారు.

తమ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు కానీ దానిలో కూడా ఈ విలీనవార్తలను ఆయన ఖండించకపోవడం గమనార్హం. 

వీటిపై బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ ఓ అవుడేటడ్ పార్టీ. అది ఇప్పటికే సగం తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ పార్టీని మా పార్టీలో విలీనం చేసుకోవలసిన అవసరం మాకు లేదు. విలీనం గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ తప్పుడు వార్తలే. వాటిలో నిజం లేదు.

కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలైతే దానికి మా పార్టీకి ఏం సంబంధం? కేసీఆర్‌ తన పార్టీలో మిగిలినవారు బయటకు వెళ్ళిపోకుండా వారిని కాపాడుకోవడానికే ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని భావిస్తున్నాను.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డితో సహా పలువురు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టించారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా ఆయనను జైలుకి పంపించడం ఖాయమే. ఎప్పుడు... ఎలా? అనేదే ప్రశ్న,” అని బండి సంజయ్‌ అన్నారు. 


Related Post