బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, తన సోదరి కల్వకుంట్ల కవిత త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు, ఆమాద్మీ నేత మనీష్ శిశోడియాకు బెయిల్ లభించినందున తన సోదరి కవితకి కూడా తప్పక బెయిల్ లభిస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అయినా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ నాలుగున్నర నెలల్లో తీహార్ జైల్లో చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో కల్వకుంట్ల కవిత గడపాల్సి వచ్చిందని, అందువల్ల ఆమె తరచూ అనారోగ్యానికి గురయ్యే వారని కేటీఆర్ చెప్పారు. ఈ నాలుగున్నర నెలల్లో ఆమె 11 కేజీలు బరువు తగ్గారని చెప్పారు. ఇప్పటికీ ఉన్న ఆరోగ్య సమస్యలు కాకుండా కొత్తగా బీపీ సమస్య కూడా మొదలైందని కేటీఆర్ చెప్పారు. వీలైనంత త్వరగా ఆమె ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నామని కేటీఆర్ అన్నారు.
కల్వకుంట్ల కవితని ఈ కేసులో మార్చి 15వ తేదీన సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు.