సుంకిశాలలో కూలిన రీటేయింగ్ వాల్

August 09, 2024


img

నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్‌ నగరానికి త్రాగునీటిని అందించేందుకు సాగర్ సమీపంలో పెద్దాపుర వద్ద నిర్మిస్తున్నసుంకిశాల పంప్‌ హౌస్‌లో పెను ప్రమాదం జరిగింది. సాగర్‌కు కేవలం 192 మీటర్ల దూరంలో ఈ పంప్‌ హౌస్‌ నిర్మిస్తున్నందున సొరంగ మార్గం ద్వారా నీళ్ళు లోనికి రాకుండా ఉండేందుకు 40 అడుగుల ఎత్తైన భారీ కాంక్రీట్ గోడ నిర్మించారు. 

కానీ ఇంజనీర్ల అంచలానాలు మించి కృష్ణనది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ధాటికి రీటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటన ఈ నెల 1వ తేదీన జరుగగా ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు దాచిపెట్టారు. దీంతో కాస్త ఆలస్యంహ ఈ ప్రమాదం గురించి మీడియాకు తెలిసింది. 

పంప్‌ హౌస్‌లో పనిచేస్తున్న కార్మికులు షిఫ్ట్ మారుతున్న సమయంలో రీటెయినింగ్ వాల్ కూలినందున ఎటువంటి ప్రాణ నష్టమూ జరుగలేదు. కానీ నిర్మాణంలో ఉన్న పంప్‌ హౌస్‌ నీళ్ళలో మునిగిపోయింది. దాంతో పాటు 40 అడుగుల గేట్లు అమార్చేందుకు నిర్మించిన కాంక్రీట్ కట్టడాలు కూలిపోయాయి. 

నదీ ప్రవాహాన్ని, ఉదృతిని అంచనా వేయడంలో పొరపాటు వలననే ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది. అయితే పంప్‌ హౌస్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది తప్ప మోటర్లు వగైరా ఏర్పాటు చేయనందున పెద్దగా నష్టం జరుగలేదు. 

దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.   

డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలోనే కమీషన్లకు కక్కుర్తి పడిందనుకున్నాము. కానీ సుంకిశాల పంప్‌ హౌస్‌ పనులలో కూడా కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించిందని స్పష్టమైంది.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఏవిదంగా ప్రయత్నిస్తోందో, సుంకిశాలలో కూడా అదేవిదంగా మా ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేలుస్తాము,” అని చెప్పారు.


Related Post