పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం ఉదయం కోల్‌కతాలోని తన నివాసం కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత సమస్యలతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.
బుద్ధదేవ్ భట్టాచార్య సీపీఎం పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయాధికారాలు కలిగిన పొలిట్ బ్యూరో సభ్యుడుగా కీలక పాత్ర పోషించారు. జ్యోతీబసు తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2011 వరకు రాష్ట్రాన్ని పాలించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏకధాటిగా 34 ఏళ్ళపాటు సాగిన సీపీఎం పాలన ఆయనతోనే ముగిసింది. 2011 శాసనసభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలలో దూసుకువచ్చిఅధికారాన్ని హస్తగతం చేసుకొని సీపీఎం శకానికి ముగింపు పలికారు.
బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించినప్పటికీ కోల్‌కతాలోని బాలీగంజ్‌లోని తన చిన్న ఇంట్లోనే నివసించేవారు. చాలా నిరాడంబరంగా ప్రజల మద్యనే జీవితం గడిపేవారు. ఆయన మృతి పట్ల ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ, వామపక్ష నేతలు సంతాపం తెలిపారు.