పంట రుణాల మాఫీపై దిగులు, రాజకీయాలు వద్దు: తుమ్మల

August 06, 2024


img

తెలంగాణ ప్రభుత్వం రెండు విడతలలో లక్షన్నర వరకు పంట రుణాలు మాఫీ చేసింది. జూలై 19న మొదటి విడతలో రూ.6,035 కోట్లు విడుదల చేసి లక్ష రూపాయలలో లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మళ్ళీ జూలై నెలాఖరున రూ.7,000 కోట్లు విడుదల చేసి లక్షన్నర వరకు పంట రుణాలు మాఫీ చేసింది. ఈ వారంలో లేదా సిఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రాగానే మూడో విడతలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీకి నిధులు విడుదల చేయబోతోంది. 

అయితే సాంకేతిక కారణాల వలన వేలమంది రైతులకు మొదటి రెండు విడతల్లో పంట రుణాలు మాఫీ సొమ్ము ఖాతాలలో జమా చేయబోతోంది. అవలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ అప్పుడే బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది. తమకు పంట రుణాలు మాఫీ కాలేదని పలువురు రైతులు ఫోన్లు చేస్తున్నారంటూ వారి వివరాలు సేకరించడం కోసం బిఆర్ఎస్ పార్టీ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పంట రుణాలు మాఫీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

ఈ నేపధ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, “దీని గురించి నాకూ రైతులు ఫోన్లు చేసి అడుగుతున్నారు. సాంకేతిక కారాణాల వలన పంట రుణాలు మాఫీ ఆలస్యం కావచ్చు కానీ రాకుండా పోదు. ఆగస్ట్ 15వ తేదీలోగా అర్హులైన ప్రతీ రైతుకీ పంట రుణాలు మాఫీ చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కనుక రైతులు దీని గురించి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

బిఆర్ఎస్ పార్టీ విమర్శలపై స్పందిస్తూ, “ఇదివరకు కేసీఆర్‌ ప్రభుత్వం దీని కోసం అవుటర్ రింగ్ రోడ్‌ని రూ.7,000 కోట్లకు అమ్మేసేందుకు కూడా సిద్దపడింది. కానీ పంట రుణాలు మాఫీ సరిగ్గా చేయకుండా పదేళ్ళు కాలక్షేపం చేసింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఒకేసారి పంట రుణాలు మాఫీ చేస్తుంటే బిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుండటం సిగ్గుచేటు. మీ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రైతులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న రాజకీయాలు ఫలించవు,” అని అన్నారు.


Related Post