కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈ ఏడాది మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటూ బెయిల్ కోసం చాలాసార్లు ప్రయత్నించారు కానీ లభించలేదు. కనుక మరోసారి ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ దాఖలు చేశారు.
దాని విచారణ నిన్ననే జరుగవలసి ఉండగా ఆమె తరపు న్యాయవాది హాజరుకాకపోవడంతో ఆ కేసు విచారణ నేటికి వాయిదా పడింది. అయితే ఆమెకు బెయిల్ ఇవ్వాలా వద్దా?అని కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవలసి ఉండగా, ఆమె స్వయంగా తన బెయిల్ పిటిషన్ వెనక్కు తీసుకోవడం విశేషం. ఈరోజు ఉదయం ఈ కేసు విచారణ మొదలవగానే ఆమె తరపు న్యాయవాది ఈ కేసుని విచారిస్తున్న జస్టిస్ కావేరీ బవేజాకు ఈ విషయం తెలిపారు.
అయితే ఇంతకాలం బెయిల్ కోసం పదేపదే ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత, ఇప్పుడు తన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపబోతున్నప్పుడు హటాత్తుగా ఎందుకు ఉపసంహరించుకున్నారు? దీని వెనుక మర్మమేమిటి?
కేంద్రంతో బిఆర్ఎస్ పార్టీకి ఏమైనా డీల్ కుదిరి, విడుదల కాబోతున్నారా లేదా ఈ శుక్రవారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరుగబోతోంది కనుక దాని కోసమే కల్వకుంట్ల కవిత తన పిటిషన్ వెనక్కు తీసుకున్నారా? లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారా? మరేదైనా కారణం ఉందా? అనే విషయం త్వరలో తెలుస్తుంది.