కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తుండగా, భూపాలపల్లి జిల్లా కోర్టు మేడిగడ్డ బ్యారేజి కేసులో మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపింది.
అదే జిల్లాకు చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ప్రైవేట్ పిటిషన్ వేశారు. వేలకోట్ల ప్రజాధనం ఖర్చుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు క్రుంగిపోయాయని, ఆ కారణంగా బ్యారేజీలో నీళ్ళు నిలువచేయలేకపోతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిని ప్రజాధనం దుర్వినియోగంగానే పరిగణించి, దీనికి బాధ్యులైన కేసీఆర్, హరీష్ రావు, మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో పాలుపంచుకున్న ఎల్&టి నిర్మాణ సంస్థని విచారించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
ఆయన పిటిషన్ విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావు, ఎల్&టి సంస్థ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, సబ్ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఎండీ కృష్ణారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5వ తేదీన తదుపరి విచారణకు హాజరుకావలసిందిగా వారిని ఆదేశించింది.
అయితే విద్యుత్ అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ నోటీస్ పంపితేనే విచారణకు హాజరుకాని కేసీఆర్, జిల్లా కోర్టు విచారణకు హాజరవుతారనుకోలేము. ఆ విచారణని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.