బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, హరీష్ రావు తదితరులను పోలీసులు కొద్ది సేపటి క్రితం శాసనసభ నుంచి అరెస్ట్ చేసి వ్యాన్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్షారెడ్డిలని ఉద్దేశ్యించి సిఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో అనుచిత వ్యాక్యాలు చేసినందుకు బేషరతుగా వారికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ కేటీఆర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలో స్పీకర్ పోడియం ఎదుట బైటాయించి నినాదాలు చేయసాగారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పదేపదే వారించినప్పటికీ వినకుండా నినాదాలు చేస్తూ సభకి ఆటంకం కలిగిస్తుండటంతో, స్పీకర్ ఆదేశం మేరకు మార్షల్స్ లోనికి ప్రవేశించి వారిని ఎత్తుకొని బయటకు తీసుకుపోయారు. అయినా వారు అక్కడ కూడా బైటాయించి ‘సిఎం డౌన్ డౌన్’ నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తోంది. సొంత చెల్లి కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉంటే ఆమె గురించి మాట్లాడని కేటీఆర్, మీ గురించి పోరాడుతున్నారంటే నమ్మశక్యంగా ఉందా? ఆలోచించండి.
సీతక్క కూడా మహిళే కదా? కానీ సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నప్పుడు ఆదివాసీ బిడ్డని అవమానిస్తున్నామని కేటీఆర్‌కు గుర్తు ఉండదా?
నేను ఇద్దరు అక్కలు (సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్షారెడ్డి) కోసం పనిచేస్తే, వారిరువురూ దొర (కేసీఆర్) కుట్రలను గ్రహించలేక ఆయన చేతిలో బందీ అయ్యారు. కనీసం ఇప్పటికైనా ఇద్దరూ దొరల చేతుల్లో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తే మంచిది,” అని అన్నారు.