తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు నేడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి హాజరయ్యారు. నిన్న సభలో సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తమ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్షారెడ్డిల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి హాజరయ్యారు. వారిద్దరూ బేషరతుగా తమ మహిళా ఎమ్మెల్యేలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే, నిన్న సభలో సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు సబితక్క మనం కాంగ్రెస్ పార్టీలో పోదామని చెప్పి ఆమె బిఆర్ఎస్ పార్టీలో చేరి నాకు హ్యాండ్ ఇచ్చారు. కనుక ఆమెను నమ్ముకుంటే ఇంతే సంగతులు,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇరు పార్టీల మద్య చిన్న వాగ్వాదం జరిగింది. దానినే బిఆర్ఎస్ పార్టీ నేడు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంగా మార్చుకుని సభలో కాంగ్రెస్‌పై పైచేయి సాధించాలనుకున్నట్లుంది.
అయితే బిఆర్ఎస్ పార్టీకి పోరాడేందుకు మరే అంశం లేకనే ఈ సాకుతో సభలో డ్రామా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు నల్లకోటు ధరించి రావడాన్ని తమ నిరసనకు మద్దతు తెలుపడంగానే భావిస్తున్నామని హరీష్ రావు చెప్పడం హాస్యస్పదంగా ఉంది.