నేపాల్ విమాన ప్రమాదంలో మృతులందరూ సిబ్బందే!

July 24, 2024


img

ఈరోజు ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండూలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన 18 మంది కూడా అదే విమాన సంస్థ శౌర్య ఎయిర్ లైన్స్ సిబ్బందేనట! సుమారు 20 ఏళ్ళ క్రితంనాటి ఆ విమానం తరచూ మరమత్తులకు గురవుతుండటంతో సంస్థ సిబ్బందిని తీసుకొని పోఖరా వద్ద గల సర్వీసింగ్ కేంద్రానికి బయలుదేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ తప్ప మిగిలిన 18 మంది చనిపోయారు. 

శౌర్యా ఎయిర్ లైన్స్ సంస్థకు 50 సీట్లు సామర్ధ్యం కలిగిన మూడు కెనెడియన్ బంబార్డియర్ సీఆర్‌జె-200 విమానాలున్నాయి. అయితే 2018లో ఆర్ధిక సమస్యలలో చిక్కుకోవడంతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. అప్పుడు భారత్‌కు చెందిన కుబేరా గ్రూప్ శౌర్య ఎయిర్ లైన్స్ లో 5.6 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత నుంచే ఆ సంస్థ కాస్త తేరుకొని మూడు విమానాలు నడుపగలుగుతోంది. 

కానీ ఇంత భారీగా పెట్టుబడి పెట్టినా శౌర్య ఎయిర్ లైన్స్ కోలుకోకపోగా మళ్ళీ నష్టాలలో మునిగిపోతుండటంతో కుబేరా గ్రూప్ తప్పుకుంది. దీంతో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. 

మూడు విమానాలకు తరచూ మరమత్తులు వస్తుండటంతో వాటిలో ఒకదానిని నేడు మరమత్తులు చేసేందుకు పోఖరా సర్వీసింగ్ కేంద్రానికి తీసుకువెళుతునప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దానిలో ఒకేసారి 18 మంది విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది మృతి చెందడం వారి కుటుంబాలకు, ఆ సంస్థకు, దానిలో పనిచేస్తున్నవారికి పెద్ద షాక్ అనే చెప్పాలి.


Related Post