ప్రభాకర్ రావు అరెస్టుకి రెడ్ కార్నర్ నోటీస్‌

July 21, 2024


img

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎస్ఐబి) ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ సీఐడీ పోలీసులు సీబీఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్‌ జారీ చేయబోతున్నారు. ఈ మేరకు సీబీఐకి లేఖ ద్వారా అభ్యర్ధించారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితుడుగా ఉన్న శ్రవణ్ రావు పేరిట కూడా రెడ్ కార్నర్ నోటీస్‌ జారీ చేయాలని సీబీఐని కోరారు. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. పోలీసుల విచారణలో తాము ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌ చేసేవారిమని చెపుతూ దానికి సంబందించిన అనేక వివరాలు, సాక్ష్యాధారాలు అందించారు. వాటి ఆధారంగా సీఐడీ పోలీసులు ప్రభాకర్ రావుపై కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్ షీట్‌ దాఖలు చేయగా ఆయన పేరిట నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

ఆ ఛార్జ్ షీట్‌, కోర్టు జారీ చేసిన ఆ అరెస్ట్ వారెంట్‌లని సీబీఐకి అందించి వారిద్దరూ ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసి భారత్‌కు పంపించేందుకు రెడ్ కార్నర్ నోటీస్‌ జారీ చేయాలని సీఐడీ పోలీసులు కోరారు. 

అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, తనపై సీఐడీ పోలీసులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్ రావు ఇదివరకు ఈమెయిల్ లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం తాను అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నాని, పూర్తిగా కోలుకున్న తర్వాత హైదరాబాద్‌ తిరిగివస్తానని దానిలో పేర్కొన్నారు. తాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని లేఖలో అభ్యర్ధించారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. 

ఇప్పుడు సీబీఐ ఆయన పేరిట రెడ్ కార్నర్ నోటీస్‌ జారీ చేసిన్నట్లయితే దాని ఆధారంగా ఆయన నేరం చేసి తప్పించుకొని పారిపోయి అమెరికా వచ్చిన్నట్లు పరిగణించి అక్కడి పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగలరు. తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచి కోర్టు అనుమతితో హైదరాబాద్‌కి తిప్పి పంపగలరు. 

అయితే భారత్‌లో అనేక బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్‌ పారిపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్‌ మాల్యా పేరిట కూడా ఇది వరకు సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్‌ జారీ చేసినా ఇంతవరకు అరెస్ట్ చేసి భారత్‌ రప్పించలేకపోయింది. కనుక ప్రభాకర్ రావు కూడా అదేవిదంగా అరెస్ట్ కాకుండా తప్పించుకునే అవకాశం కూడా ఉంది. 


Related Post