ఆనవాయితీ ప్రకారం రేపు (ఆదివారం) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహించడానికి ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో బోనాల పండుగ మొదలైనప్పటి నుంచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి జనాలు పోటెత్తుతున్నారు.
రేపు మంత్రులు, అధికార ప్రతిపక్షా ఎమ్మెల్యేలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తారు కనుక భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఆలయ పరిసరాల చుట్టూ 2 కిమీ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళేవారు, బయటకు వచ్చేవారు ఈ రెండు రోజులూ ప్లాట్ ఫారం: 1 వైపు గల ప్రధాన ద్వారానికి బదులు పదో నంబర్ ప్లాట్ ఫారంవైపు నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
టొబాకో బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వచ్చే మార్గాన్ని మూసివేశారు. దాంతో పాటు బాటా ఎక్స్ రోడ్డు-రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ రోడ్డు, జనరల్ బజార్ రోడ్, ఆదయ్య ఎక్స్ రోడ్ మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రకటించింది.
రాణీగంజ్, కర్బలా మైదాన్, రాంగోపాల్ పేట ఓల్డ్ పోలీస్ స్టేషన్, ప్యారడైజ్, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లెన్, బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్ పూరా మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఈ రెండు రోజులూ వేరే మార్గాల గుండా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం సూచించింది.
ఇంకా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న బస్సులను కూడా ఇతర మార్గాలగుండా పంపించబోతున్నారు. కనుక నగర ప్రజలందరూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్ గుర్తుంచుకోవాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం సూచించింది.