భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో నిర్మించిన పెద్దవాగు డ్యామ్‌కు భారీ గండి పడింది. దాని దిగువన గల గుమ్మడవల్లి,. కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలలోకి వరదనీరు ప్రవేశించింది.
రాత్రిపూట గండి పడటంతో గ్రామస్తులకు ఏమి జరుగుతోందో గ్రహించేలోగానే ఒక్కసారిగా ఊళ్ళలోకి వరద నీరు ప్రవేశించింది. దానిలో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. పూరిళ్ళు, ఇంటి సామాను, బట్టలు, వాహనాలు అన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. వెంటనే ప్రజలు తమ భయంతో పరుగులు తీస్తూ సమీపంలోగల ఎత్తైన భవనాలు, కొందరు చెట్ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద నీరు ముంచెత్తడంతో వేల ఎకరాలలోని పంటలు నీట మునిగాయి.
నారాయణపురంలో 22 మంది వరద నీటిలో చిక్కుకొన్నట్లు తెలియగానే తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సిఎస్ శాంతికుమారికి ఫోన్ చేసి చెప్పారు.
ఆమె వెంటనే ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌తో మాట్లాడి నేవీ హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు. దానిలో వారందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
అటు ఆంధ్రావైపు ఏలూరు జిల్లాలోని 10 గ్రామాలలోకి కూడా నీరు ప్రవేశించడంతో చాలా భారీగా ఆస్తి నష్టం జరిగింది.
శుక్రవారం ఉదయం 9 గంటలకు పేరూరులో గోదావరి నీటి మట్టం 40.86 అడుగులు ఉంది. మరో రెండు అడుగులు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు చేరితే అత్యంత ప్రమాదాన్ని సూచించే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటారు.
గోదావరి వరద నీరు చాలా ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఇసుక బస్తాలతో పెద్దవాగు గండిని పూడ్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కనుక భద్రాద్రితో సహా గోదావరి పరీవాహక ప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.