మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఢిల్లీకి దేనికంటే...

July 17, 2024


img

మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఈ నెల 20వ తేదీన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ అధికారులతో సమావేశమయ్యేందుకు వెళుతున్నారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలలో ఏర్పడిన సమస్యల గురించి చర్చించి, ఈ వర్షాకాలం ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వస్తే బ్యార్జీలు దెబ్బ తినకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశంపై వారితో చర్చించనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈ మూడు దెబ్బ తినడంతో వాటి మరమత్తులకు, రక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి చెప్పారు. కనుక కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మరమత్తులకి, డిండి తదితర ప్రాజెక్టులకి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. 

సమ్మక్క సారలమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌ నుంచి కొంత భూభాగం అవసరం ఉంటుందని, దాని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో రూ.18,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే వెళ్ళిపోతోందని, అందువల్ల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి చెప్పారు.


Related Post