పటాన్‌చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేడు సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
కొన్ని రోజుల క్రితమే ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్ రెడ్డి వారి బంధు మిత్రుల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. మహిపాల్ రెడ్డి సోదరులు బినామీ పేర్లతో అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు రూ.300 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని ఈడీ అధికారులు ప్రకటించారు.
మహిపాల్ రెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడేందుకు మహిపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు సిద్దపడిన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మహిపాల్ రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందని తెలిసి కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే అవినీతిపరులకు కాంగ్రెస్ పార్టీ రక్షణ కల్పిస్తోందని ప్రతిపక్షాలు, మీడియా ఆరోపించకుండా ఉంటాయా?
ఇదీగాక శాసనసభ ఎన్నికలలో మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి కాట శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు తదితరులు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది.