ఆంధ్రా పెళ్ళికొడుక్కి తెలంగాణలో పందిరి దేనికి? బిఆర్ఎస్ ప్రశ్న

July 06, 2024


img

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజా భవన్‌లో సమావేశమయి విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఊహించిన్నట్లే వీరి సమావేశంపై అప్పుడే బిఆర్ఎస్ పార్టీ విమర్శలు ప్రారంభించింది. 

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు సిఎం అయ్యారు చాలా సంతోషమే. కానీ ఆ ఆంధ్రా పెళ్ళి కొడుక్కి ఇక్కడ తెలంగాణలో పందిరి వేయడం దేనికో అర్దం కావటం లేదు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని పరిష్కరిస్తామంటే మేము స్వాగతిస్తాము. కానీ ఈ సమావేశం విభజన సమస్యల పరిష్కారం కోసం కాక, చంద్రబాబు నాయుడుకి బాజాలు వాయించడానికే అన్నట్లుంది. 

పదేళ్ళుగా రెండు రాష్ట్రాల ప్రజలు ఎవరి మానాన్న వారు జీవిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ తమ స్వార్ధ రాజకీయాల కోసం మానిన ఆ గాయాలను మళ్ళీ కెలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మేము ముందు నుంచే హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు అదే జరుగుతోంది. కనుక తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. 


Related Post