ఈసారి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్?

July 05, 2024


img

బిఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి కేసీఆర్‌ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ నానాటికీ దిగజారిపోతూనే ఉంది. గురువారం ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి అంతకంటే ఇంకా పెద్ద షాక్ తగులబోతోంది. ఈసారి ఐదుగురు ఎమ్మెల్యేలు, కనీసం 10 మంది కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోబోతున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌లో చేరిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కేసీఆర్‌ సూచన మేరకు నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 10 మంది కార్పొరేటర్లు హాజరు కాలేదు. వారికి ఫోన్లు చేస్తే బదులు ఇవ్వడం లేదని బిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. అంటే వారందరూ ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు సిద్దం అవుతున్నారనుకోవచ్చు. 

బిఆర్ఎస్‌ సమావేశానికి మొహం చాటేసిన ఎమ్మెల్యేలలో మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజ్‌గిరి), వివేకానంద (కుత్బుల్లాపూర్‌), లక్ష్మారెడ్డి (ఉప్పల్) ఉన్నారు.    ఎమ్మెల్యేలు పద్మారావు, ప్రకాష్ గౌడ్, కాలేరు వెంకటేష్ మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యారు.  

ఒకవేళ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయిన్నట్లయితే బిఆర్ఎస్‌ బలం 32 నుంచి 27కి పడిపోతుంది. కాంగ్రెస్‌ బలం 71 నుంచి 76కి పెరుగుతుంది.


Related Post