బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్?

July 05, 2024


img

గద్వాల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే బిఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌ సరిత తిరుపతయ్య అభ్యంతరం చెపుతుండటంతో ఆయన  చేరిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాప్పుడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో చాలా ఇబ్బందిపడేవారు. 

బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి మారడానికి ఇదీ ఓ కారణమే. కానీ ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మళ్ళీ ఆయనతో తలనొప్పులు మొదలవుతాయని, కనుక ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని ఆమె అభ్యంతరం చెపుతున్నారు. 

కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెంచుకోవడం చాలా అవసరం కనుక సిఎం రేవంత్‌ రెడ్డి తరపున కొందరు సీనియర్ నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నా ఆమెకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి తరపున వారు హామీ ఇచ్చి ఒప్పించిన్నట్లు తెలుస్తోంది. 

రేపటి నుంచి ఆషాడమాసం మొదలవుతుంది. కనుక ఈరోజు రాత్రిలోగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం ఉంది. 

గురువారం అర్దరాత్రి ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా అంతకు ముందు, కె కేశవ్ రావు తన రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో జూలై మొదటివారంలోనే ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఓ సీనియర్ నాయకుడు బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 


Related Post