ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: జీవన్ రెడ్డి

June 25, 2024


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్‌ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొదట కాంగ్రెస్ పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేయాలనుకున్నారు.

కానీ మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్‌ నేతలు వచ్చి బుజ్జగించడంతో కాస్త మెత్తబడిన్నట్లు కనపడినా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గకూడదని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. త్వరలోనే ప్రజల మద్యకు వెళ్ళి వారి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగాలా వద్దా? అనే విషయం నిర్ణయించుకుంటానని చెప్పారు.

దీంతో ఈరోజు ఉదయం మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మళ్ళీ బేగంపేటలోని ఆయన నివాసానికి వెళ్ళి తొందరపడవద్దని, సిఎం రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత అందరం కూర్చొని చర్చించుకుందామని నచ్చజెప్పారు. 

అటు బిఆర్ఎస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్‌తో కలిపి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఐదుగురు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ఇంకా మరో 20 మంది వరకు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి రాబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదివరకే చెప్పారు. కనుక బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఫిరాయింపులను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 


Related Post