బిఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్!

June 25, 2024


img

ఊహించిన్నట్లే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. నాలుగు రోజుల క్రితమే బాన్సువాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోగా, ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి సిఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

దీంతో అటు బిఆర్ఎస్ పార్టీలో ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా అలజడి ఏర్పడింది. బిఆర్ఎస్‌ టికెట్‌ మీద గెలిచి కాంగ్రెస్‌లో చేరినందుకు బిఆర్ఎస్‌ కార్యకర్తలు కరీంనగర్‌లో ఆయన ఇంటిని ముట్టడించి నిరసనలు తెలియజేసేందుకు బయలుదేరగా వారిని పోలీసులు చెదరగొట్టారు. 

ఇన్నేళ్ళుగా తాను ఎవరితో పోరాడుతున్నానో ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునందుకు కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సిఎం రేవంత్‌ రెడ్డి తనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా డా.సంజయ్ కుమార్‌ చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న జీవన్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. 

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సిఎం రేవంత్‌ రెడ్డికి ఈవిషయం తెలియగానే మంత్రులు శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ప్రభుత్వ విప్‌లు ఆదివారం శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, కోరుట్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నర్సింగరావులను ఆదివారం సాయంత్రం ఆయనను బుజ్జగించేందుకు పంపించారు. వారి బుజ్జగింపులతో ఆయన మెత్తబడిన్నట్లే ఉన్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నలబై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశాను. కానీ శాసనసభలో మా పార్టీ బలం పెంచుకునేందుకో లేదా ప్రభుత్వం సుస్థిర కోసమో ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మావంటి సీనియర్లకు తెలియజేసి అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేది. కానీ మాట మాత్రంగానైనా చెప్పకుండా ఈవిదంగా చేయడంతో నాకు చాలా బాధ కలిగింది. మా పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీకి నా సేవలు కొనసాగుతాయి,” అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. 


Related Post