పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ ద్రోహి: బిఆర్ఎస్

June 23, 2024


img

మాజీ అసెంబ్లీ స్పీకర్‌, బాన్సువాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బిఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. బిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బీగాల గణేశ్‌ల ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

కేసీఆర్‌ ఆయనకు ఎంతో గౌరవం, పదవులు, నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇచ్చి గౌరవిస్తే, తన స్వీయ ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కేసీఆర్‌కు ద్రోహం చేశారని ఆరోపించారు.

పదవి, అధికారం కోసం పార్టీలు మార్చే ఆయన రేపు కాంగ్రెస్‌ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు అమలుచేయలేకపోతున్న రేవంత్‌ రెడ్డి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఇటువంటి చవుకబారు రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు సవాలు విసిరారు. కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు అప్పుడే విసుగెత్తిపోయారని కనుక మళ్ళీ బిఆర్ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్‌ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోగా ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బయటకు వెళ్ళిపోయారు. దీంతో బిఆర్ఎస్‌ పార్టీలో ఇప్పుడు 35 మంది మాత్రమే మిగిలారు.

మరికొంత మంది బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇప్పుడు ఇలా మీడియా సమావేశం నిర్వహించి ఫిరాయింపులను ఖండించినవారు కూడా రేపు బిఆర్ఎస్‌ పార్టీలో ఉంటారో లేదో అనుమానమే. కనుక పార్టీ బలహీనపడకుండా కాపాడుకునేందుకు కేసీఆర్‌ కార్యాచరణ సిద్దం చేసుకోవడం మంచిది. 


Related Post