రెండు రోజుల క్రితం చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం సిఎం రేవంత్ రెడ్డి ఆల్వాల్‌లోని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వెళ్ళి ఆయనను, పరామర్శించి, పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ఓదార్చారు.
సిఎం రేవంత్ రెడ్డిని చూడగానే ఎమ్మెల్యే సత్యం కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేశారు. అసలే తల్లి తండ్రులు పోయిందన్న దిగులుతో ఉన్న పిల్లలు ఇద్దరూ తండ్రి అలా ఏడ్వడం చూసి వారు కూడా భోరున ఏడ్వటం మొదలుపెట్టారు.
సిఎం రేవంత్ రెడ్డి వారిద్దరినీ దగ్గరకు తీసుకొని బుజ్జగించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సత్యంతో వేరేగా మాట్లాడి ఆయన భార్య రూపాదేవి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సత్యం కుటుంబానికి తాను అండగా ఉంటానని సిఎం రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పి వెళ్ళారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి తమ ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని గురువారం ఉదయమే తిరిగివచ్చారు. మూడు రోజులు బయట ఉండటంతో నియోజకవర్గంలో పర్యటించి పనులు చూసుకుని వస్తానని ఎమ్మెల్యే సత్యం ఉదయం బయటకు వెళ్ళారు. కానీ పనుల కారణంగా రాత్రి 10.30 గంటల వరకు ఇంటికి చేరుకోలేదు.
అంతలో రూపాదేవి భర్తకు ఫోన్ చేసి మాట్లాడి తన గదిలోకి వెళ్ళి ఫ్యానుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆమె చాలా కాలంగా గైనిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోజు చాలా విపరీతంగా కడుపు నొప్పి రావడంతో ఆ బాధ భరించలేక భర్తకు ఫోన్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు.
ఎమ్మెల్యే సత్యం, ఆమె ఇద్దరూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో సత్యం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.