ఏపీలో కూడా లిక్కర్ స్కామ్‌!

June 22, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత మూడున్నర నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు మొన్న రెగ్యులర్ బెయిల్‌ లభించినప్పటికీ, చివరి క్షణంలో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బయటకు రాలేకపోయారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ లిక్కర్ స్కామ్‌ జరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపిస్తున్నారు. ఏపీలో సంపూర్ణ మధ్యపానం అమలుచేస్తానని చెప్పిన జగన్‌ ప్రభుత్వం, స్వయంగా మద్యం వ్యాపారం నడిపించిందని, దానిలో వైసీపి నేతలకు లేదా వారి సన్నిహితులకు చెందిన మద్యం తయారీ కంపెనీల నుంచి నాసి రకం మద్యాన్ని కొనుగోలు చేసి దానిని మరింత ఎక్కువ ధరలకు అమ్మిందని దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపిస్తున్నారు. 

ఆ నాసిరకం మద్యానికి కూడా నగదు చెల్లింపులనే తప్ప మొబైల్ యాప్స్ ద్వారా చెల్లింపులను అంగీకరించేవారు కారని, ఆ సొమ్మంతా జగన్, వైసీపి నేతల జేబులలోకి చేరిందని దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికే ఈ కేసుని ఏపీ సీఐడీ విచారణ జరుపుతోంది. కానీ దీని వలన చంద్రబాబు ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని వైసీపి నేతలు చెప్పుకునే అవకాశం లభిస్తుందని, కనుక ఈ కేసు విచారణని సీబీఐకి అప్పగించాలని ఆమె నిన్న చంద్రబాబు నాయుడుని కలిసి విజ్ఞప్తి చేశారు. 

ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆమె ప్రతిపాదనకు అంగీకరిస్తే, ఈసారి లిక్కర్ స్కామ్‌లో జగన్‌తో సహా పలువురు వైసీపి నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.


Related Post