పంట రుణాలు మాఫీకి రేవంత్‌ సర్కార్ గ్రీన్ సిగ్నల్‌

June 22, 2024


img

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో ప్రధానంగా ఈ అంశంపైనే లోతుగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు...  

2018, డిసెంబర్‌ 12 నుంచి 2023, డిసెంబర్‌ 9వరకు గత ఐదేళ్ళలో రూ.2 లక్షల లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లే ఆగస్ట్ 15లోగా మొత్తం ఒకేసారి పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. 

దీని కోసం గత ప్రభుత్వం రూ.28,000 కోట్లు ఖర్చు చేయగా, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రూ. 31,000 కోట్లు ఖర్చు చేయబోతోంది. 

పిఎం కిసాన్ యోజన పధకానికి అనుసరిస్తున్న నిబంధనల ప్రకారమే దీనినీ అమలుచేయాలని నిర్ణయించారు. 

త్వరలోనే దీనికి సంబందించి పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది.  

ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సంబందిత వర్గాలతో చర్చించి ఇచ్చిన నివేదిక ప్రకారమే పంట రుణాల మాఫీ విధివిధానాలు రూపొందించబడ్డాయి.  

పంట రుణాల మాఫీ, రైతు భరోసా పధకాలతో సహా ప్రభుత్వానికి సంబందించి అన్ని వ్యవహారాలు, నిర్ణయాలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు మాత్రమే అధికారిక ప్రకటనలు చేస్తారు. వేరే ఎవరు ఏం చెప్పినా అవి వారి సొంత అభిప్రాయలుగానే పరిగణింపబడతాయి. 


Related Post