రేపు శుక్రవారం హైదరాబాద్‌లో బొగ్గు మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో తెలంగాణలోని శ్రావణపల్లితో సహా ఇతర రాష్ట్రాలలో బొగ్గు గనుల వేలంపాట జరుగబోతోంది. శ్రావణపల్లి బొగ్గు గనిని వేలంపాట నుంచి మినహాయించి నేరుగా సింగరేణికి అప్పగించాలనే అభ్యర్ధనను బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డి నిర్ద్వందంగా తిరస్కరించారు. కనుక దానిని దక్కించుకోవడం కోసం సింగరేణి సంస్థ కూడా తొలిసారిగా ఈ వేలంపాటలో పాల్గొనబోతోంది.
ఈ పరిణామాలపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, “కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే అవి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయకపోగా సింగరేణి ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంతంగా బొగ్గు గనులు లేకపోవడంతో అది నష్టాలలో కూరుకుపోతోందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దానిని అమ్మేసేందుకు సిద్దపడింది. కానీ టిడిపి ఇప్పుడు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో దానిని నిలిపివేయించింది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా సింగరేణిని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు?
సింగరేణికి సొంతంగా బొగ్గు గనులు లేకుండా చేసి దానినీ ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2021, డిసెంబర్‌లో సింగరేణికి వేలంపాట లేకుండా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఆయనే సింగరేణిని వేలంపాటలో పాల్గొనమని పంపిస్తున్నారు. ఇంతలోనే ఆయన వైఖరి ఎందుకు మారింది?
గుజరాత్, ఒడిశా రాష్ట్రాలలో స్థానిక ప్రభుత్వ రంగా సంస్థలకు వేలంపాట లేకుండానే బొగ్గు గనులు అప్పగించారు. కానీ సింగరేణి పట్ల ఈ వివక్ష ఎందుకు?” అని కేసీఆర్ ప్రశ్నించారు.