తెలంగాణలో ఎమ్మెల్యేల వేట... మొదలైందా?

June 20, 2024


img

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు జరుగుతాయని కాంగ్రెస్‌, బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీల నేతలు ముందే చెప్పారు. మూడింటిలో ఏ పార్టీ ఓడిపోతే దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుందని అందరూ ఊహించిందే. 

లోక్‌సభ ఎన్నికలలో 12 లేదా అంత కంటే ఎక్కువ సీట్లే గెలుచుకుంటామని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత ఇంత త్వరగా మరో ఓటమిని తట్టుకోవడం, దాని పర్యవసానాలు ఎదుర్కోవడం ఏ పార్టీకైనా కష్టమే. ముందే చెప్పుకున్నట్లు ఓడిపోయిన బిఆర్ఎస్‌ పార్టీకి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. 

ఆ పార్టీ ఎమ్మెల్యేలని ఆకర్షించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ముందుగా బీజేపీ తన వద్ద ఉన్న ఈడీ అస్త్రాన్ని బిఆర్ఎస్‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ప్రయోగించింది. గతంలో బిఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడూ లాగ్డారం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదై ఉంది. మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్ రెడ్డి ఇద్దరూ బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తూ, ఆ వచ్చిన సొమ్ముని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో పెట్టిన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఆ కేసులలోనే ఈడీ అధికారులు గురువారం ఉదయం 5 గంటల నుంచే వారిద్దరి ఇళ్ళతోపాటు పఠాన్ చెరు, నిజాంపేటలోని మహిపాల్ రెడ్డి బంధువుల ఇళ్ళలో కూడా సోశాలు చేశారు. అంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఒత్తిడి మొదలైందని భావించవచ్చు. కనుక ఆయన వాటిని తట్టుకుంటూ బిఆర్ఎస్‌లోనే ఉంటారా బీజేపీలోకి వెళ్ళిపోయి కేసుల బెడద వదిలించుకుంటారో చూడాలి.


Related Post