ఈసారి సిఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా శాసనసభకు పోటీ చేస్తుండటం, ఆయనపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి కామారెడ్డి నియోజకవర్గంపైనే ఉంది. తమ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్నందున బిఆర్ఎస్, రేవంత్ రెడ్డి చేస్తున్నందున కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. వారిద్దరి నడుమ గెలిచే అవకాశం తక్కువగానే ఉంటుందని తెలిసి ఉన్నప్పటికీ బీజేపీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఉదృతంగా ప్రచారం చేస్తోంది.
కేసీఆర్ తరపున స్వయంగా ఆయనతో పాటు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో సహా పలువురు ప్రచారం చేస్తున్నారు. ఈనెల 24న జుక్కల్‌లో మంత్రి హరీష్ రావు ఎన్నికల సభ నిర్వహించనున్నారు. తర్వాత మంత్రి కేటీఆర్ రెండు రోజులు కామారెడ్డిలో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు.
ఈనెల 24న జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ రాబోతున్నారు. అదే రోజున కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా రేవంత్ రెడ్డితో జుక్కల్ కలిసి రోడ్ షోలో పాల్గొనబోతున్నారు.
హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కూడా నవంబర్ 24వ తేదీన జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.
ఈ నెల 25న ప్రధాని నరేంద్రమోడీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తున్నారు.
మూడు పార్టీల అగ్రనేతలు ప్రచారానికి తరలి వస్తుండటంతో ఈసారి కామారెడ్డి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.