తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈ నెల 28తో ముగుస్తుంది. ఆ తర్వాత అన్ని పార్టీలు, అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం, బహుమతులు పంచుతారు. ఇది ఎన్నికల సంఘంతో సహా అందరికీ తెలిసిన రహస్యం. ఈ గడువులోగా డబ్బు, మద్యం వగైరాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది కనుక వాటిని తరలిస్తున్నప్పుడు పోలీసులకు పట్టుబడుతున్నారు.
మంగళవారం ఉదయం హైదరాబాద్, వనస్థలిపురం వద్ద పోలీసులు తనికీలు నిర్వహిస్తుండగా కర్ణాటక నుంచి వస్తున్న ఓ వాహనంలో రూ.1.44 కోట్లు పట్టుబడింది. పోలీసులు ఆ సొమ్ముని, వాహనాన్ని స్వాధీనం చేసుకొని డ్రైవరుని, అతనితో పాటు ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బు కాంగ్రెస్ పార్టీ కోసం పంపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇప్పటి వరకు సుమారు రూ.600 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, వెండి నగలు, గోడ గడియారాలు, క్రికెట్ బ్యాట్లు వంటి ఇతర బహుమతులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రోజూ ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను తనికీలు చేస్తున్నారని తెలిసి ఉన్నా, ఇంకా ఇంత భారీగా డబ్బు తరలిస్తుండటం ఆశ్చర్యమే.