మరో 9 రోజులలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అన్ని పార్టీల అభ్యర్ధులూ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా తిరుగుతున్నారు. ఇటువంటి సమయంలో ఐటి శాఖ అధికారులు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి జి.వివేక్ వెంకటస్వామి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు.
హైదరాబాద్, సోమాజీగూడ, బేగంపేటలోని ఆయనకు చెందిన ఇళ్ళు, కార్యాలయాలలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే మంచిర్యాలలోని ఆయన నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఆయన సంస్థకు రూ.8 కోట్లు వచ్చిన్నట్లు ఐటి అధికారులు గుర్తించారు. అవి ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాయని తెలుసుకొనేందుకు ఐటి అధికారులు సోదాలు నిర్వహించి రికార్డులు తనికీలు చేస్తున్నారు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఎదుర్కొలేకనే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బిఆర్ఎస్, బీజేపీల మద్య బలమైన సంబందాలు ఉన్నాయని ఈ ఐటి దాడులే నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.