తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతలు పార్టీ అధికారంలో లేకపోయినా పదవుల కోసం కీచులాడుకొంటూనే ఉంటారని నిరూపిస్తూనే ఉన్నారు. మరిప్పుడు ఎనికలలో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పుడు ఊరుకొంటారా? అంటే కాదని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, జగ్గారెడ్డి తదితరులు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని మనసులో మాటను చెప్పేశారు.
ఆమె నిన్న హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కావాలని ఎవరికి ఉండదు?నాకూ ముఖ్యమంత్రి అవ్వాలనే ఉంది. కానీ సాధ్యమా? కర్ణాటకలో డికె శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకొంటే మా అధిష్టానం సిద్దరామయ్యని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా ఎవరికి వారు మేమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకొని తిరుగుతున్నప్పటికీ, అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వారే ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడ సీట్లు తప్పక గెలుచుకొంటుందని నమ్మకం నాకుంది,” అని రేణుకా చౌదరి అన్నారు.