తెలంగాణ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఓటర్లకు డబ్బు పంచిపెట్టేందుకు రాజకీయ నాయకులు తమ నల్లధనాన్ని బయటకు తీసి తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు తరలిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రెండు కార్లలో భారీగా సొమ్ముని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ వద్ద పోలీసులు కాపుకాసి వాటిని అడ్డుకొని సోదాలు చేయగా వాటిలో రూ.7.4 కోట్లు పట్టుబడింది.
పోలీసులు ఐటి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్‌కు చెందిన ఓ విద్యాసంస్థల ఛైర్మన్ ఫామ్ హౌసుకి చేరుకొని తనికీలు నిర్వహించారు.
పోలీసులు స్వాధీనం చేసుకొన్న సొమ్ముని ఐటి శాఖకు అప్పగించారు. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోసం ఆయన సమీప బంధువు ఈ సొమ్ముని ఖమ్మంకు తరలిస్తున్నట్లు సమాచారం.
శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు పోలీసులు రూ.570 కోట్లకు పైగా నగదు, భారీగా వెండి, బంగారు ఆభరణాలు, వాటిని తరలిస్తున్న వాహనాలను పట్టుకొన్నారు.