హుజూర్ నగర్ శాసనసభ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, శనివారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో సరదాగా మాట్లాడుతూ, “తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చేవరకు నేను గెడ్డం గీసుకొనని శపధం చేశాను. ఇప్పుడు నేను గెడ్డం గీసుకొనే రోజు దగ్గర పడింది. డిసెంబర్ 3న తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన్నట్లు ప్రకటించగానే గెడ్డం గీసుకొని మీ ముందుకు వస్తాను. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. దానికి క్లీన్ షేవ్ చేసుకొని వస్తాను.
ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తుంది. మా పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు, మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హామీకి మా పార్టీ కట్టుబడి ఉంటుంది. ప్రతీ హామీని తప్పకుండా అమలుచేస్తుంది. కర్ణాటక ఎన్నికలలో అక్కడి ప్రజలకు ఇచ్చిన 5 గ్యారెంటీ హామీలను అధికారంలోకి రాగానే అమలుచేశాము. అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని హామీల అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొంటాము,” అని చెప్పారు.