సిఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెపుతోంది. దానిని ప్రవేశపెట్టిన తర్వాతే రైతులకు దళారుల బెడద తప్పింది. తమ భూములను సులువుగా క్రయవిక్రయాలు జరుపుకోగలుగుతున్నారు. ధరణీ ఆధారంగానే రైతుల బ్యాంక్ ఖాతాలలోకి నేరుగా రైతు బంధు, రైతు భీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయి. మరి ధరణిని రద్దు చేస్తే ఇవన్నీ ఎలా వస్తాయి?
మేము ఎంతో లోతుగా అధ్యయనం చేసి రైతులకు మేలు చేసేందుకే ధరణి పోర్టల్ ప్రవేశపెట్టాము. దాంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటోంది. చక్కగా నడుస్తున్న వ్యవస్థలను కూల్చివేస్తానంటున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవలసిన అవసరం మనకేమిటి?
తెలంగాణ ప్రజలు, రైతుల హక్కుల కోసం పోరాడేందుకే బిఆర్ఎస్ పుట్టింది. అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన తెలంగాణను దోచుకొనేందుకు వస్తున్న వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోరాడుతోంది. ఆనాడు రాష్ట్రం ఏర్పడక మునుపు తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరే పోల్చి చూసుకొని, తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించమని మీ అందరినీ కోరుతున్నాను,” అని అన్నారు.