తెలంగాణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. నేడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రాబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించింది. కానీ ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేయలేదు. ఈరోజు ఖర్గే, రాహుల్ గాంధీల చేతుల మీదుగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. నేడు వరంగల్ ఈస్ట్, పినపాక, నర్సంపేట నియోజకవర్గాలలో వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి బిఆర్ఎస్ పార్టీ కూడా ఇంచుమించు అటువంటి హామీలే ఇచ్చింది. ఈ గ్యారెంటీ రేసులో బీజేపీ వెనుకబడిపోయింది. కనుక బీజేపీ కూడా మోడీ గ్యారెంటీ పేరుతో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేయబోతోంది. దానిలో ‘ఒక్క ఓటు రెండు పెన్షన్లు’ హామీ ప్రధానమైనదని తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 18న తెలంగాణలో పర్యటించి బీజేపీ మ్యానిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. మర్నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణలో చేవెళ్ళ, నారాయణ పేట్‌లో ఎన్నికల సభలో పాల్గొంటారు.
సిఎం కేసీఆర్ ఇప్పటికే రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున రాష్ట్రమంతా చుట్టేస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే. నేడు చొప్పదండి, బండి సంజయ్ పోటీ చేస్తున్న కరీంనగర్, ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గాలలో ఎన్నికల సభలలో పాల్గొనబోతున్నారు.