నిజామాబాద్‌లో విషాదం... షాపింగ్ మాల్‌లో బాలిక మృతి

October 03, 2023


img

నిజామాబాద్‌లో నిన్న ఓ విషాద ఘటన జరిగింది. రిషిత (4) అనే చిన్నారి తండ్రితో కలిసి నందిపేట్‌లోని ఎన్‌ మార్ట్ షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు, అక్కడ ఐస్‌క్రీమ్ తీసుకొనేందుకు ఫ్రిజ్ తలుపు తెరవగా కరెంట్ షాక్ తగిలి అక్కడే చనిపోయింది. 

ఆ సమయంలో ఆమె తండ్రి రాజశేఖర్ పక్కనే ఉన్న ఫ్రిజ్‌లో తనకు కావలసినవి తీసుకొంటున్నాడు. కరెంట్ షాక్ తగిలి కుమార్తె చనిపోయి, ఫ్రిజ్ తలుపు పట్టుకొని వ్రేలాడుతున్నా కొన్ని క్షణాలు గమనించలేదు. ఆ తర్వాత కూతురిని ఆ పరిస్థితిలో చూసి కంగారుగా ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. 

ఒకవేళ అతను వెంటనే గమనించి ఉండి ఉంటే ఆ చిన్నారి బ్రతికి ఉండేదేమో?నిత్యం రద్దీగా ఉండే ఆ షాపింగ్ మాల్లో ఓ ఫ్రిడ్జ్ కరెంట్ షాక్ కొడుతోందనే విషయం చిన్నారి రిషిత చనిపోయెవరకు యాజమాన్యానికి తెలియకపోవడం విస్మయం కలిగిస్తుంది. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం, భోధన్‌ పట్టణంలో నివాసం ఉంటున్న గూడూరు రాజశేఖర్ మొన్న ఆదివారమే భార్య, కుమార్తెతో కలిసి నందిపేట్‌లోని అత్తారింటికి వచ్చాడు. సోమవారం ఉదయం వారు తిరిగి భోదన్ బయలుదేరుతుండగా, కూతురు ఐస్‌ క్రీమ్ కావాలని మారాం చేసింది. పాపను తీసుకొని షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు ఈ విషాద ఘటన జరిగింది.


Related Post