ఆదివారం మహబూబ్ నగర్‌లో జరిగిన మోడీ సభలో రాష్ట్ర బీజేపీ నేతలందరూ పాల్గొన్నారు. కానీ విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు! వారిద్దరూ గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
విజయశాంతి వాటిని ఖండిస్తున్నప్పటికీ, పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని సోషల్ మీడియాలో బహిరంగంగా ఆరోపించడంతో ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే విషయం బయటపడింది. కనుక ఆమెను కాంగ్రెస్ పార్టీలో రప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి చేజేతులా తన ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకొన్నప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేటికీ కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నందున తమ్ముడిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
అందుకే విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోడీ సభకు హాజరవలేదేమో?ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఎలాగూ తాడోపేడో తేల్చుకొని బయటపడక తప్పదు. కనుక త్వరలోనే వీరిద్దరి భవిష్య కార్యాచరణపై పూర్తి స్పష్టత రావచ్చు.