ఏపీలో మంత్రులు ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిన్నప్పుడు తమ శాఖలలో జరుగుతున్న పనుల గురించి ఏమైనా మాట్లాడితే వినాలని ఏపీ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కానీ వారు చంద్రబాబు, లోకేశ్, పవన్‌లను విమర్శించడానికి లేదా అవహేళన చేయడానికి మాత్రమే మీడియాకు వస్తుంటారు.
మాజీ మంత్రి, వైసీపి ఎమ్మెల్యే పెర్నీ నాని, విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోయిడిచిన్నట్లే ఏదో ఓ రోజు మంత్రి హరీష్ రావు కూడా తన మామ కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవటం ఖాయమే. అయితే ఎన్టీఆర్‌లాగ కేసీఆర్ అమాయకుడు కాదు. మహా ముదురు. కనుక అల్లుడు గిల్లుడూ సాగవని నేను అనుకొంటున్నాను,” అని వ్యంగ్యంగా అన్నారు.
వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చాలా తెలివిగా మాట్లాడుతున్నామని భావిస్తుంటారు. కానీ అద్దాల మేడలో కూర్చొని దారిన పోయేవారిపై రాళ్ళు విసురుతున్నామని, అది తమకే ప్రమాదమని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
వారి అధినేత జగన్మోహన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని పార్టీ నుంచి రాష్ట్రం నుంచి కూడా పారిపోయేలా చేశారు. దాంతో వారు తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకొని కాలక్షేపం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్ వెనకేసుకు వస్తున్నారు. అప్పుడు వివేకా కుమార్తె సునీతా రెడ్డి తమకు ఏపీలో న్యాయం జరగదని ఆ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయించుకొన్నారు.
ఈ నాలుగున్నరేళ్ళలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అరాచకాలు, రాజకీయ కక్షలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే ఇందుకు తాజా నిదర్శనం.
ఏపీలో నెలకొన్న పరిస్థితుల వలన ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదు. ఉన్నవి కూడా తెలంగాణకు తరలివచ్చేస్తున్నాయి. ఏపీ పరిస్థితి ఈవిదంగా ఉన్నప్పుడు అభివృద్ధిపదంలో దూసుకుపోతున్న తెలంగాణను చూసి ఓర్వలేక ఇలాగ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రులు తిరిగి జవాబు చెపితే తట్టుకోలేరు.