మలక్‌పేటలో ఐటెక్ న్యూక్లియస్ టవర్‌ మూడేళ్ళలో రెడీ: కేటీఆర్‌

October 02, 2023


img

ఐ‌టి కంపెనీలన్నీ హైదరాబాద్‌లో హైటెక్ సిటీలోనే ఏర్పాటవుతుండటంతో ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది. అయితే నగరం నలువైపులా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో మలక్‌పేటలో ఐటెక్ న్యూక్లియస్ టవర్‌ నిర్మాణానికి నేడు మంత్రులు కేటీఆర్‌, మహమూద్ అలీ, మజ్లీస్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలతో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ టవర్ గురించి మంత్రి కేటీఆర్‌ వివరిస్తూ, “ఇప్పటి వరకు మలక్‌పేట అంటే చాలా ఎత్తుండే టీవీ టవర్ అందరికీ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు దానికంటే చాలా ఎత్తుండే ఈ ఐ‌టి టవర్ రాబోతోంది. రూ.700 కోట్లు వ్యయంతో దీనిని మూడేళ్ళలోగా నిర్మించి అందుబాటులోకి తెస్తాము. 11 ఎకరాల విస్తీర్ణంలో 30 అంతస్తులతో నిర్మించబోతున్న ఈ ఐ‌టి టవర్‌లో 15 లక్షల చదరపు అడుగులు ఐ‌టి కంపెనీలకు, మిగిలిన 5.5 చదరపు అడుగులు నాన్-ఐ‌టి కంపెనీలకు కేటాయించబోతున్నాము. 

వీటిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబ్ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకువస్తాము. ఈ ఒక్క ఐ‌టి టవర్ ద్వారానే సుమారు 20-25 వేలమంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇది అందుబాటులోకి వస్తే ఇప్పుడు మలక్‌పేట నుంచి మాదాపూర్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకొంటున్న యువత అంత దూరం వెళ్ళక్కరలేకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోగలుగుతారు. 

ఐ‌టి ఉత్పత్తుల ఎగుమతి విషయంలో మనం చెన్నై, బెంగళూరులను అధిగమించేశాము. ఇప్పుడు దేశంలో నంబర్” 1 స్థానంలో తెలంగాణ ఉంది. జాతీయస్థాయి ఐ‌టి ఉత్పత్తులలో అంతకు ముందు ఏడాదిలో తెలంగాణ నుంచే 33%, గత ఏడాదిలో 41% వాటా సాధించింది. కనుక దేశంలో ఐ‌టి కంపెనీలకు, ఐ‌టి ఉద్యోగాలకు, ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారింది. 

ఇదంతా కేవలం 9 ఏళ్ళలోనే చేసి చూపించాము. అయినా ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధిని చూడలేకపోతున్నారు,” అని కేటీఆర్‌ అన్నారు. 


Related Post