బిఆర్ఎస్ పార్టీలో తొలి జాబితాలోనే 115 మంది అభ్యర్ధులను ప్రకటించేసి సిఎం కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మిగిలిన నాలుగు స్థానాలకు కూడా అభ్యర్ధులను ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును ఖరారు చేయడంతో ఆయన నిన్న మంత్రి మల్లారెడ్డితో కలిసి తన నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, ఘోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్లను ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం చేసుకొనేందుకు సిఎం కేసీఆర్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.నేడో రేపో వారిపేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొదటి జాబితాలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బిఆర్ఎస్ పార్టీలో టికెట్ లభించక నిరాశ చెందిన చాలా మంది కాంగ్రెస్, బీజేపీలలో చేరేందుకు క్యూ కడుతుండటంతో ఆ రెండు పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటించడానికి తొందరపడటం లేదు. అయితే అక్టోబర్ 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కనుక ఆలోగానే రెండు పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది.