డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ... తర్వాత అరెస్ట్?

September 23, 2023


img

టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ను హైదరాబాద్‌లో నార్కోటిక్స్ పోలీస్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మాదాపూర్‌లో ఓ అపార్టుమెంట్‌లో జరిగిన రెవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి కొందరు వ్యక్తులను, సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నిషేదిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. 

ఆ కేసులోనే నిందితుగా ఉన్న నవదీప్ ఇన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించగా, హైకోర్టు అతని అభ్యర్ధనను తిరస్కరించింది. దాంతో నవదీప్ పోలీసులకు లొంగిపోయి విచారణకు హాజరవుతున్నాడు.

అతను మాదకద్రవ్యాలు సేవిస్తున్నాడా లేదా తెలుసుకొనేందుకు, నవదీప్ ఒప్పుకొంటే పోలీసులు అతని రక్తం, జుట్టు, గోళ్ళు శాంపిల్స్ తీసుకొని ల్యాబ్‌కు పంపిస్తారు. విచారణలో టాలీవుడ్‌లో ఇంకా ఎవరెవరు మాదకద్రవ్యాలు వాడుతుంటారు?వారికి ఎవరు వాటిని సరఫరా చేస్తుంటారు?

ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాంచంద్, మాజీ ఎంపీ విట్టల్ రావు కుమారుడు సురేష్ తదితరులతో ఏవిదంగా పరిచయాలు ఏర్పడ్డాయి? డ్రగ్స్ సరఫరాకు ఏ విధానాలు అనుసరిస్తున్నారు?వంటి ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం.

మళ్ళీ మరోసారి విచారణకు పిలుస్తారా లేక నేడు విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తారా? అనేది సాయంత్రానికల్లా తెలుస్తుంది.


Related Post