మైనంపల్లి రాజీనామా లేఖలో కేసీఆర్‌పై ఆరోపణలు

September 23, 2023


img

మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేస్తూ సిఎం కేసీఆర్‌కు పంపిన లేఖను మీడియాకు విడుదల చేశారు. 

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు పార్టీలో ఎటువంటి లోపాలు కనిపించలేదు. కానీ రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నాక పార్టీలో ప్రజాస్వామ్యం, పారదర్శకత బొత్తిగా లేవని కనుగొన్నారు. 

పార్టీలో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు ఎన్నడూ విలువ ఇవ్వలేదని, పార్టీ పేరు మార్పుతో సహా అన్నీ ఏకపక్ష నిర్ణయాలే అని మైనంపల్లి ఆరోపించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పార్టీని విస్తరించే ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, వాటి వలన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం తగ్గిందని ఆరోపించారు. 

బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా దూరం అవుతోందని పేర్కొన్నారు. ప్రజలు, పార్టీ నేతలు, శ్రేణుల అభిప్రాయాలు పట్టించుకోకుండా ఏకపక్షంగా కేసీఆర్‌ ప్రకటించిన అనేకమంది అభ్యర్ధులకు నియోజకవర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. 

పార్టీలో కొందరు నేతలతో తనకు తీవ్ర అభిప్రాయబేధాలున్నాయని, వారు తనపై మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికార దాహంతో అలమటించిపోతున్న కొందరి చేతుల్లో బిఆర్ఎస్ పార్టీ చిక్కుకొందని ఆరోపించారు. అటువంటి నేతల చేతిలో కీలుబొమ్మలా తాను పనిచేయలేనని అన్నారు. తనకు కేటాయించిన మల్కాజిగిరి టికెట్‌ను తిరస్కరిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. 

దశ, దిశ కోల్పోయిన ఇటువంటి పార్టీలో తాను పనిచేయదలచుకోలేదని కనుక తన రాజీనామాను ఆమోదించవలసిందిగా మైనంపల్లి హన్మంతరావు లేఖలో కోరారు.

కొన్నిరోజుల క్రితం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, తన కొడుకు మెదక్ నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్‌ టికెట్ ఇవ్వనందునే పార్టీని వీడాలనుకొంటున్నట్లు చెప్పారు. కానీ రాజీనామా లేఖలో సిఎం కేసీఆర్‌ని, పార్టీ నేతలను నిందిస్తూ వారి కారణంగానే తాను పార్టీ వీడుతున్నానని పేర్కొన్నారు. 


Related Post