తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ దూసుకుపోవలసిన బీజేపీ అంతర్గత సమస్యలతో బాధపడుతోంది. తాజాగా పార్టీలో సీనియర్ మహిళా నేత విజయశాంతి పార్టీలో కొందరు నేతల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.
“చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు... పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని... ఇదంతా తెలిసి కూడా కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారం తప్పక ఖండంచదగ్గది... జై శ్రీరామ్ హర హర మహాదేవ జై తెలంగాణ,” అని ట్వీట్ చేశారు.
ఇంతకీ పార్టీలో ఆమెను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు?పార్టీ వీడుతున్నారని ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలు ఆమె బయటపెట్టలేదు. పెడితే ఈ సమస్య ఇంకా పెద్దదయ్యేది.
“అయితే ప్రతీరోజూ నేను మీడియా ముందుకు వచ్చి పార్టీ మారడం లేదు. మారుతున్నట్లు వస్తున్నవన్నీ పుకార్లే,” అని ఎన్నిసార్లు ఖండించాలి?నాకీ దుస్థితి ఎందుకు?” అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.