స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎట్టకేలకు అలకపాన్పు దిగి తన స్థానంలో పోటీ చేయబోతున్న కడియం శ్రీహరికి మద్దతు ప్రకటించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇద్దరూ నేడు ప్రగతి భవన్‌కు వచ్చారు.
ఎన్నికల తర్వాత రాజయ్యకు తగిన పదవి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చి, కడియం శ్రీహరి గెలుపు కోసం సహకరించవలసిందిగా కోరారు. కేటీఆర్ సూచన మేరకు రాజయ్య అందుకు అంగీకరించి కడియం శ్రీహరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆయన తనకు అన్నలాంటివారని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియంని గెలిపించుకొనే బాధ్యత తనదేనని అన్నారు. ఇక నుంచి ఆయన గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తానని మంత్రి కేటీఆర్‌కు రాజయ్య హామీ ఇచ్చారు.
కడియం శ్రీహరి కూడా గతంలో అనుకొన్న మాటలను మనసులో పెట్టుకోవద్దని రాజయ్యను కోరారు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో వారిద్దరి మద్య టికెట్ కోసం జరుగుతున్న యుద్ధం ముగిసింది.
అయితే రాజయ్య నిజంగానే తన మాటపై నిలబడతారా లేదా?ఇప్పుడు వేరే దారి లేదు కనుక అయిష్టంగానే కడియంకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, ఎన్నికల సమయంలో ఆయనను వెనక నుంచి దెబ్బ తీస్తారా?అనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. కనుక కడియం శ్రీహరి ఆయనపై ఆధారపడకుండా ఎన్నికలలో గెలిచేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకోక తప్పదు.