ఆదివారం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ విజయభేరి సభలు భారీగా జనాలు తరలిరావడంతో విజయవంతం అయ్యింది. ఇంతకాలం కీచులాడుకొంటూ పార్టీ పరువు తీస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయడం వలననే ఈ సభ విజయవంతం అయ్యిందని చెప్పవచ్చు.
ఈ సభకు హాజరైన కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలు తెలంగాణ ప్రజలకు 5 పధకాలు ప్రకటించారు. ఈసారి ఎన్నికలలో తమ పార్టీని గెలిపించి అధికారం ఇస్తే ఈ పధకాలను అమలుచేస్తామని హామీ ఇచ్చారు.
గృహజ్యోతి: ప్రతీ కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్.
మహాలక్ష్మి: మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్తెసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం.
రైతు భరోసా: భూమి ఉన్న రైతులకు ఏటా రూ.15,000, భూమిలేని కౌలు రైతులకు ఏటా రూ. 12,000. వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
యువ వికాసం: ఉన్నత విద్యలభ్యసించేందుకు విద్యార్ధులకు రూ.5 లక్షలు ఆర్ధిక సాయం, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు.
చేయూత: వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు నెలకు రూ.4,000 పింఛన్. రూ.10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా.
ఇవి కాక తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల నివాస స్థలాలు కేటాయింపు.
ఇంటికి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేనివారికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం.
అంబేడ్కర్ అభయహస్తం పధకంలో ఎస్సీ ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్ధిక సాయం.
ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సోనియా, రాహుల్ గాంధీలు హామీ ఇచ్చారు. ఈ హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలుచేసి చూపించగలరా? అంటూ బిఆర్ఎస్ నేతల సవాళ్ళకు రాహుల్ గాంధీ సమాధానం చెపుతూ, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ హామీలన్నిటినీ అధికారంలోకి రాగానే అమలుచేసింది. ఇక్కడా అదేవిదంగా అమలుచేస్తాము. అందుకే వీటిని మేము గ్యారెంటీ స్కీములు అని చెపుతున్నాము. అర్హులందరికీ ఈ గ్యారెంటీ స్కీమ్‌లకు గుర్తింపు కార్డులు కూడా ఇస్తాము. ఇదే మా నిజాయితీకి నిదర్శనం,” అని అన్నారు.