పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం ప్రారంభం

September 16, 2023


img

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నేడు మరో సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. సిఎం కేసీఆర్‌ కొద్దిసేపటి క్రితం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌ వద్ద బాహుబలి మోటర్లను ఆన్‌ చేసి, కృష్ణా జలాలను అప్రోచ్ కాలువలోకి విడుదల చేశారు. అక్కడి నుంచి కృష్ణా జలాలు మొట్ట మొదట అంజనగిరి జలాశయంలోకి చేరాయి. అక్కడే సిఎం కేసీఆర్‌ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. 

నార్లాపూర్ పంప్ హౌసులో ఏర్పాటు చేసిన 145 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన తొమ్మిది మోటార్లు రోజుకి 2 టీఎంసీలు లేదా 3,200 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తిపోయగలవు. అయితే ప్రస్తుతం రోజుకి 1.5 టీఎంసీలు నీళ్ళ చొప్పున 60 రోజుల పాటు 90 టీఎంసీలు ఎత్తిపోస్తూ జలాశయాలను నింపుతారు. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌ ఆరు   జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ఆరు జిల్లాలలో  1,226 గ్రామాలకు స్వచ్చమైన త్రాగునీరు లభిస్తుంది. అలాగే ఆ జిల్లాలోని పరిశ్రమలకు 0.33 టీఎంసీలు నీళ్ళు అందించబోతున్నారు. 



Related Post