సూర్యపేట సద్దుల చెరువులో త్వరలో బోట్ రైడ్స్

June 01, 2023


img

ఒకప్పుడు ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్‌ గుర్తొచ్చేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో చెరువుల సుందరీకరణ చేసి ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువుకు కూడా మహర్ధశ మొదలైంది. మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొనిసద్దుల చెరువు సుందరీకరణ పనులు చేయిస్తున్నారు. దీనికోసం ఈ రంగంలో పేరు మోసిన డిజనర్స్ చేత ప్రత్యేకంగా పార్కు డిజైనింగ్ చేయిస్తున్నానని చెప్పారు. 

ఈరోజు ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌తో కలసి సద్దుల చెరువును సందర్శించి సుందరీకరణ పనుల గురించి చర్చించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సద్దుల చెరువు సుందరీకరణ పనులతో పాటు, చెరువులో బోట్ రైండింగ్ కోసం రెండు రకాల బోట్లను కూడా తెప్పిస్తున్నాము. వాటిలో ఒకటి క్రూయిజ్ బోట్, మరొకటి స్పీడ్ బోట్. క్రూయిజ్ బోటులో పుట్టినరోజు, పెళ్ళిరోజు వంటి శుభకార్యాల పార్టీలు జరుపుకొనేందుకు వీలుగా సకల సౌకర్యాలతో ఉంటాయి. ఇప్పటికే రెండు బోట్లు పట్టణానికి చేరుకొన్నాయి. వీటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి త్వరలోనే ప్రారంభిస్తాము. సద్దుల చెరువు ఒడ్డున చక్కటి పార్కు, దానిలో వాకింగ్ ట్రాక్, మేడిటేషన్ సెంటర్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నాము. సూర్యపేట పట్టణంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై అద్భుతమైన స్వాగత ముఖద్వారం నిర్మించబోతున్నాము,” అని చెప్పారు.  Related Post