రఘునందన్ రావుపై వెయ్యి కోట్లకు ఐఆర్‌బీ దావా

May 30, 2023


img

హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్డులో టోల్‌ప్లాజాల నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుపై వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తూ, ఆయనకు నోటీసు పంపించింది. ఆయన తమ సంస్థపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేశారని కనుక వాటిని ఉపసంహరించుకొని తక్షణం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని నోటీసులో పేర్కొంది. 

ఆ సంస్థ కేటీఆర్‌, కల్వకుంట్ల కవితల సన్నిహితులకు చెందినది కావడంతో దానికి లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 30 ఏళ్ళ లీజుకు ఇచ్చేసిందని, ఈవిదంగా మరెక్కడా జరుగలేదన్నారు. ఆ కంపెనీ టెండర్లలో రూ.7,272 కోట్లు పేర్కొనగా, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అది రూ.7,380 కోట్లకు ఎలా పెరిగిందని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఐఆర్‌బి గురించి ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే వారికి బెదిరింపులు మొదలైపోతాయని రఘునందన్ రావు ఆరోపించారు. ఐఆర్‌బికి లాంగ్ లీజు ఇవ్వడం వలన తెలంగాణ ప్రభుత్వం వేలకోట్ల ఆదాయం నష్టపోతుందన్నారు. ఈ ఆరోపణలన్నిటినీ ఐఆర్‌బీ ఖండించడమే కాకుండా పరువు నష్టం దావా కూడా వేస్తోంది. కనుక దీనిపై రఘునందన్ రావు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post