జూన్ 9 నుంచి తెలంగాణలో మరో సంక్షేమ పధకం ప్రారంభం

May 30, 2023


img

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలో కుల వృత్తులు చేసుకొని జీవించేవారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం (తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు) అందజేయాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో బీసీ, ఎంబీసీ, రజక, నాయీ బ్రాహ్మణ, పూసల,బుడగ జంగాలు, సంచార జాతులు, తదితరులకు వారి కుల వృత్తులు కొనసాగించుకొనేందుకుగాను లక్ష రూపాయలు చొప్పున అందజేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. దశాబ్ధి ఉత్సవాలలో ఈ నెల 9న సంక్షేమ దినోత్సవంనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకాన్ని ప్రారంభించాలని కేసీఆర్‌ మంత్రులను ఆదేశించారు. 

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రి వర్గం సబ్ కమిటీ ఒకటి రెండు రోజులలో దీనికి సంబందించి విధివిధానాలను ఖరారు చేయనుంది. కేసీఆర్‌ ఆమోదం తీసుకొన్న తర్వాత వాటికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు.  

ఈ ఏడాది చివరిలోగా శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున, కాంగ్రెస్‌, బిజెపిలు ఈసారి ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని చాలా పట్టుదలగా ప్రయత్నిస్తున్నాయి. కనుక బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొనేందుకు సిఎం కేసీఆర్‌ కూడా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఈవిదంగా ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.


Related Post