ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, కేసీఆర్‌తో భేటీ దేనికో?

May 27, 2023


img

ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌ వచ్చి సిఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. తన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో విపక్షాలన్నీ  వ్యతిరేకించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. కనుక పార్లమెంటులో బిఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని సిఎం కేసీఆర్‌ని  కోరేందుకు కేజ్రీవాల్ నేడు హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఏవిదంగా ఎదుర్కోవాలనే విషయంపై వారిరువురూ చర్చించనున్నారు. వారి సమావేశం ముగిసిన వెంటనే కేజ్రీవాల్ మళ్ళీ ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.     

ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు తప్పనిసరిగా తనకు లోబడి పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ ఆదేశాలపై కేజ్రీవాల్ ప్రభుత్వం  సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, అధికారులు ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి తప్ప గవర్నర్‌కి కాదని తీర్పు చెప్పి కేంద్రానికి పెద్ద షాక్ ఇచ్చింది. దాంతో కేంద్రం వారి నియమకాలు, బదిలీలకు సంబందించి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఢిల్లీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ ప్రధాని నరేంద్రమోడీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ బాధితులే. కనుక ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అభ్యర్ధనపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించడం ఖాయమే.


Related Post