హైదరాబాద్‌కు ప్రధాని మోడీ... బ్యానర్లు సిద్దం చేసుకోవాలే

March 27, 2023


img

ప్రధాని నరేంద్రమోడీ ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్‌-తిరుపతి మద్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలకు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకాల్సి ఉండగా, వారిని విమర్శిస్తూ హైదరాబాద్‌ నగరంలో ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుండటం సర్వసాధారణమైపోయింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ ప్రశ్నిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వంపై సిఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నసంగతి తెలిసిందే. కనుక ఈసారి ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో బిఆర్ఎస్ నేతలు ఎటువంటి ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేయబోతున్నారో? 

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం దక్షిణమద్య రైల్వే అధికారులు రెండు మార్గాలలో సర్వే చేశారు. 1. సికింద్రాబాద్‌-బీబీనగర్, నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి. 2. సికింద్రాబాద్‌-బీబీనగర్, నల్గొండ, గుంటూరు, పిడుగు రాళ్ళ, శ్యామలాపురం , ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి. వీటిలో ఏదో ఓ మార్గాన్ని ఖరారు చేస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌-తిరుపతికి మిగిలిన రైళ్లలో సుమారు 12 గంటల సమయం పడుతోంది. అదే... వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో కేవలం 6-7 గంటలలో చేరుకోవచ్చు. 

ఈ ఏడాది జనవరి 15 నుంచి సికింద్రాబాద్‌-విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మద్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్ సర్వీసులు ప్రారంభమయ్యి విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల మద్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కాబోతోంది.  


Related Post